అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్(Donald Trump), డెమోక్రాట్ పార్టీ నుంచి జో బైడెన్(Joe Biden) బరిలోకి దిగనున్నారు. కేవలం అధికారికంగా ప్రకటించటమే మిలిగింది. అయితే ఇప్పటి వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇలా ఒకే అభ్యర్థులు వరుసగా రెండు సార్లు బరిలో దిగడం రెండో సారి.
ఈ నేపథ్యంలో అధ్యక్ష బరిలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తనను ఎన్నుకోకపోతే రక్తపాతం తప్పదని హెచ్చరించారు. తాను ఎన్నికైతే అమెరికాకు దిగుమతి చేసుకున్న కార్లను చైనా విక్రయించేదేలేదని స్పష్టం చేశారు. ఒహియోలోని డేటన్ సమీపంలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు.
2021 జనవరి 6న క్యాపిటల్ హిల్‌పై జరిగిన దాడిలో భాగమై జైలుకెళ్లిన వారిని ఉద్దేశిస్తూ ‘అధికారంలోకి రాగానే ఆ బందీలను విడిపిస్తా’ అంటూ వాగ్దానం చేశారు. మరోసారి ఎన్నికైతే తాను తీసుకునే మొదటి నిర్ణయం అదేనని ప్రకటించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని బందీలుగా అభివర్ణించారు. నవంబర్ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య విధిని నిర్ణయిస్తుందని అన్నారు ట్రంప్. ఆయన చేసిన రక్తపాతం వ్యాఖ్యలపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.
మరో జనవరి 6 ఘటన కావాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారని అన్నారు. ట్రంప్‌నకు అమెరికా ప్రజలు మరోసారి ఓటమిని చూపించనున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు నిక్కీ హేలీ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్‌నకు ఆమె అభినందనలు తెలిపారు.