తెలంగాణ(Telangana)లో చేనేత వస్త్రాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ప్రశంసల జల్లు కురిపించారు. భూదాన్ పోచంపల్లి(Boodan Pochampally)లో రాష్ట్రపతి ఇవాళ (బుధవారం) పర్యటిస్తున్నారు. పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరల తయారీని పరిశీలించారు. అంతకు ముందు అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.
శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ముర్ము బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పోచంపల్లికి వెళ్లారు. ముందుగా పట్టణంలోని టూరిజం సెంటర్, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్లారు. భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం వినోబాబావే భవనంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
భూదాన్ పోచంపల్లి(Boodan Pochampally)లో రాష్ట్రపతి మాట్లాడుతూ.. పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు ట్యాగ్ రావడం అభినందనీయమన్నారు. చేనేత పరిశ్రమ (Handloom cloths)తో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని, తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తున్నదని తెలిపారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే ఎంతో ఆనందం కలిగిందని రాష్ట్రపతి చెప్పారు. భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని తెలిపారు.
యూఎన్‌ఏ భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం ఈ ప్రాంతానికే గర్వకారణమన్నారు ముర్ము. ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతు దొరుకుతుందని, చేనేత వస్త్రాల కళను వారసత్వంగా మరొకరికి అందించడం ప్రశంసనీయమన్నారు. చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానంటూ రాష్ట్రపతి తెలిపారు. గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరముందని వెల్లడించారు.