ఆన్లైన్ బెట్టింగ్ యాప్ (Online Betting App) విషయంలో ఎన్నో వివాదాలు చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే. స్వయంగా పోలీసులు కూడా కొన్ని సందర్భాలలో ఆన్లైన్ బెట్టింగ్ పై చర్యలు తీసుకొన్నారు. ఈ యాప్ పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సోషల్ మీడియాలో (Social Media) ప్రచారం కూడా చేశారు పోలీసులు (Police). ఇంతవరకు బాగానే ఉన్నా స్వయంగా పోలీస్ ఆఫీసరే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఉపయోగిస్తే చర్యలు ఉండవా అనే అనుమానం వస్తుంది.
కానీ చట్టానికి ఎవరు చుట్టాలు కాదని నిరూపించారు మహారాష్ట్ర పోలీస్ అధికారులు. మహారాష్ట్ర (Maharashtra)లోని పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన SI సోమ్‌నాథ్ జెండే.. డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో.. సోమ్‌నాథ్ (Somnath) బెట్టింగ్ కాసి ఈ డబ్బులు పొందారు. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.
నిబంధనలను అతిక్రమించి పోలీస్ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆయనను విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఏసీపీ సతీశ్ మానే ధ్రువీకరించారు. డీసీపీకి తదుపరి శాఖపరమైన విచారణ బాధ్యతలను అప్పగించారు. అయితే కోటిన్నర గెలుచుకుని వార్తల్లో నిలిచిన సోమ్‌నాథ్.. సస్పెండ్ అయ్యి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వీధి విచిత్రం అంటే ఇదే కావచ్చు..!