మందు బాబుల గొంతు ఎండిపోయే వార్త ఇది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలను ఇప్పటికే ముమ్మరం చేశారు. అందులో భాగంగా మద్యం షాపుల(Wine Shops) మూసివేతపై ఓ క్లారిటీ ఇచ్చారు. నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెలాఖరులో వరుసగా మూడు రోజులు పాటు రాష్ట్రంలో డ్రై డే(Dry Day)గా పాటించాలని సూచిస్తున్నారు.
ఈనెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు మూసివేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశాల మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తాము సూచించిన మూడు రోజుల్లో మద్యం విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బార్లు, వైన్ షాపుల యజమానులకు ముందస్తు సమాచారం ఇచ్చి మూడురోజుల బంద్‌పై అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. పోలింగ్ వేళ ఏ పార్టీ నేతలూ ఓ టర్లను ప్రభావితం చేయొద్దని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నిక ప్రచారంలో నేతలు బిజీ అయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పెద్దమొత్తంలో మద్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి మద్యం షాపులు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. అయినా నియోజకవర్గాల్లో అభ్యర్థులు బెల్టు షాపుల్లో మాట్లాడి ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం తమకు చిన్న సమాచారం అందినా తనిఖీ చేస్తూ నేతల ప్రణాళికలను నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు.