ఓ హత్య కేసులో దుబాయ్(Dubai)లో జైలుశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. సిరిసిల్ల, రుద్రంగి, కొనరావుపేటకు చెందిన ఆ ఐదుగురు 18ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు. నేపాల్(Nepal)కు చెందిన వాచ్‌మన్ బహదూర్‌సింగ్ హత్య కేసులో వీరు జైలుపాలయ్యారు.
ఈ హత్యకేసులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి, సోదరులు నాంపల్లి వెంకట్, దుండిగల్ లక్ష్మణ్, జగిత్యాల జిల్లాకు చెందిన శివరాత్రి హనమంత దోషులుగా ఉన్నారు. ముందుగా పదేళ్ల జైలుశిక్ష విధించిన దుబాయ్ కోర్టు(Dubai Court)ఆ తర్వాత 25ఏళ్లకు వారి జైలుశిక్షను పొడిగించింది. ఇప్పటికే 18 ఏళ్ల జైలుశిక్ష అనుభవించారు.
మరో ఏడేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు. నేపాల్‌కు వెళ్లి హత్యకు గురైన బహదూర్‌సింగ్ కుటుంబసభ్యులకు రూ.15లక్షల పరిహారం అందజేశారు. అనంతరం వారితో క్షమాభిక్ష పత్రం రాయించినా నిందితుల విడుదలకు దుబాయ్ కోర్టు అంగీకరించలేదు.
తెలంగాణవాసుల తరఫు న్యాయవాదులు అనారోగ్య కారణాలు చూపుతూ మరోసారి వారి విడుదలకు ప్రయత్నించారు. దీంతో వారు ఏడేళ్లు ముందుగానే కోర్టు వారిని విడుదల చేసింది. దాంతో వారు దుబాయ్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. 18 ఏళ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.