Telugu News » Fali S Nariman: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత..!

Fali S Nariman: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత..!

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌(Fali S Nariman) ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆయన ఇవాళ (బుధవారం) ఉదయం కన్నుమూశారు.

by Mano
Fali S Nariman: Senior Supreme Court lawyer passes away..!

న్యాయరంగంలో ఓ శకం ముగిసింది. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారీమన్‌(Fali S Nariman) ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆయన ఇవాళ (బుధవారం) ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 95 సంవత్సరాలు.

Fali S Nariman: Senior Supreme Court lawyer passes away..!

నారీమన్‌ బ్రిటిష్‌ బర్మా రంగూన్‌లో 1929లో జన్మించారు. షిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి ఆశయం కోసం సివిల్స్‌ ఎగ్జామ్స్‌ వైపు అడుగులేశారు. చివరికి ఆర్థిక స్తోమత సహకరించక న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. 1991 నుంచి 2010 వరకు ఆయన బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేశారు.

న్యాయవాద వృత్తిలో ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్‌, 2007లో పద్మవిభూషణ్‌ పురస్కారాలతో సత్కరించింది. అదేవిధంగా 1999 నుంచి 2005 వరకు నారీమన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. బాంబే హైకోర్టులో 22 ఏళ్లపాటు ప్రాక్టీస్‌ చేసిన ఆయన.. 1971 నుంచి సర్వోన్నత న్యాయస్థానంలో పని చేస్తూ వచ్చారు.

నారీమన్ 2014లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత కేసులో వాదనలు వినిపించి ఆమెకు బెయిల్‌ ఇప్పించారు. అదేవిధంగా గోలఖ్‌నాథ్‌, ఎస్పీ గుప్తా, టీఎంఏ పై ఫౌండేషన్‌ లాంటి కేసుల్ని ఆయన వాదించారు. సుప్రీం కోర్టు ఏవోఆర్‌ కేసును సైతం ఈయనే వాదించారు. అంతేకాదు.. భారత రాజ్యాంగ చట్టం రూపకల్పనలోనూ నారీమన్‌ కీలక పాత్ర పోషించారు.

1972 నుంచి మూడేళ్లపాటు అదనపు సోలిసిటర్‌ జనరల్‌గానూ పని చేశారు నారీమన్. అయితే.. ఎమర్జెన్సీ కారణంగా ఆయన రాజీనామా చేశారు. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన కేసులో యూనియన్‌ కార్బైడ్‌ కంపెనీ తరఫున వాదించారు నారిమన్‌. అయితే అది తన కెరియర్‌లో చేసిన పొరపాటని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నారీమన్‌ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment