హిమాలయ దేశం నేపాల్(Nepal) వరుస భూకంపాలతో(Earthquake) చిగురుటాకులా వణికిపోతోంది. మరోసారి గురువారం తెల్లవారుజామున 1.20 గంటలకు మక్వాన్‌పూర్ (Makwanpur)జిల్లాలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.5గా నమోదయిందని నేపాల్ సీస్మోలజికల్ సెంటర్ (NSC) తెలిపింది.
ఈనెల 3న నేపాల్‌లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భూమి కంపించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపణలతో హిమాలయ దేశం ఒక్కసారిగా వణికిపోయింది.
భూకంపం ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో 157 మంది మృతిచెందారు. ఇదే నెలలో రెండోసారి భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వచ్చిన భూకంప కేంద్రం చిట్లాంగ్‌లో ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించింది.
అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు వెల్లడించారు.