Telugu News » ధనిక రాష్ట్రమా?.. కేసీఆర్ కు ఈటల మాస్ వార్నింగ్

ధనిక రాష్ట్రమా?.. కేసీఆర్ కు ఈటల మాస్ వార్నింగ్

by admin
eatala rajender on kcr

ఎన్నికలు సమీపిస్తుండడంతో బీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పోరుబాట ప్రారంభించింది. వంద రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంలో యుద్ధానికి దిగింది. సోమవారం జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు దిగింది. పార్టీ కీలక నేతలు ఈ ధర్నాల్లో పాల్గొన్నారు. హన్మకొండ, వరంగల్ కలెక్టరేట్ల ఎదుట జరిగిన నిరసన కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

eatala rajender on kcr

అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్న కేసీఆర్.. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు ఈటల. రాష్ట్రంలోని రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానని చెప్పి.. మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ పార్టీల నాయకులు పార్లమెంట్​ లో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తిరిగి అది కేసీఆర్ ​కే వెళ్తుందని తెలిపారు. తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేస్తే చిల్లర ఆరోపణలు చేసి తనను బీఆర్​ఎస్​ పార్టీ నుంచి బయటికి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈటల. అహర్నిశలు శ్రమించి పార్టీని గెలిపించాలని వరంగల్ సభలో ప్రధాని మోడీ, జేపీ నడ్డా చెప్పారని.. సీఎం కేసీఆర్ ​ను గద్దె దించడమే తన కర్తవ్యమన్నారు. కేసీఆర్​తో కొట్లాడడానికే తనను రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ చేశారని తెలిపారు. కట్టిన డబుల్ బెడ్​ రూం ఇండ్లను పంచని బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లోకి వెళ్తారని ఎద్దేవ చేశారు. 2023 తర్వాత కేసీఆర్ సర్కార్ పని ఖతమేనన్నారు. మళ్ళీ ఆయనకు ఓటు వేయబోమని పేద ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు.

2014లో అధికారంలోకి వచ్చాక కేంద్రం ఆశ్చర్యపోయే రీతిలో డబుల్ బెడ్ రూం ఇండ్లను కట్టిస్తామని కేసీఆర్ గొప్పలు చెప్పారని గుర్తు చేశారు రాజేందర్. ఆనాడు డబుల్ బెడ్ రూం ఇండ్లు సాధ్యం కాదని తాము అప్పుడే చెప్పామన్నారు. డబ్బులిస్తే ప్రజలే కట్టుకుంటారని చెప్పినా.. కేసీఆర్ వినిపించుకోలేదని తెలిపారు. బాట సింగారంలో నిర్మించిన ఇండ్ల గోడలు పెచ్చులూడి పోయాయన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కు కళ్ళు నెత్తికెక్కాయని మండిపడ్డారు ఈటల రాజేందర్.

You may also like

Leave a Comment