EC : ఎన్నికల కమిషన్ ని పునర్వ్యవస్థీకరించేందుకు చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్, ఎలెక్షన్ కమిషనర్ల నియామకాల విషయంలో కేంద్రం తెచ్చిన బిల్లులో మరో ముఖ్యమైన అంశాన్ని చేర్చారు. సెర్చ్ కమిటీ సూచించిన పేర్లు కాకుండా ప్రధాని మోడీ (Modi) సారథ్యం లోని నియామక ప్యానెల్ .. బయటి వ్యక్తులను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చునని ఈ తాజా బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది, ప్రతిపాదిత లా లోని సెక్షన్ 8 (2) కింద సెలక్షన్ కమిటీ … సెర్చ్ కమిటీ చేర్చిన పేర్లను కాక బయటి వ్యక్తుల పేర్లను కూడా పరిశీలించవచ్చు.
అంటే కేబినెట్ కార్యదర్శి నేతృత్వం లోని సెర్చ్ కమిటీ వడపోత పోయని వారి పేర్లను కూడా ప్రధాని సారథ్యంలోని ప్యానెల్ పరిశీలించవచ్చునని ఈ కొత్త బిల్లు నిర్దేశిస్తోంది. ఎన్నికల ప్రధాన అధికారి, ఎలెక్షన్ కమిషనర్ల నియామకాల విషయంలో ఈ ప్యానెల్ కి అధికారాలు ఉంటయి. సీఈసీ, ఇతర ఎలెక్షన్ కమిషనర్ల నియామకాలు సర్వీసు కండిషన్లు, టర్మ్ ఆఫీస్ బిల్లు పేరిట దీన్ని ప్రతిపాదించారు.
కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ .. వీరి నియామకాలకు సంబంధించి సెలెక్షన్ కమిటీ పరిశీలన నిమిత్తం అయిదుగురు వ్యక్తులతో ప్యానెల్ ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది. బిల్లు లోని సెక్షన్ 7 (1) ప్రకారం ఈసీలో నియామకాలకు మోడీ నేతృత్వంలోని ప్యానెల్ చేసే సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేస్తారు.
ఈ బిల్లును గతవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో ప్రవేశ పెట్టారు. ఈసీల నియామక ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్ ని తొలగించాలని కూడా కేంద్రం నిర్ణయించడం విశేషం. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ లో చీఫ్ జస్టిస్, ప్రధాని, లోక్ సభలో ప్రతిపక్ష నేత ఉండాలని గత మార్చిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ కేంద్రం తెచ్చిన ఈ బిల్లు ఆ తీర్పునకు వ్యతిరేకంగా ఉంది. అందువల్లే విపక్షాలు దీనిపై మండిపడుతున్నాయి. ఎన్నికల సంవత్సరంలో మోడీ తనకు అనుకూలురైన వారిని ఈసీలో నియమించుకునేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోందని కాంగ్రెస్ నేత జైరాంరమేష్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ని తన కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన దుయ్యబట్టారు.