Telugu News » TTD Chairman : భక్తుల రక్షణ ఎలా..!! టీటీడీ!!

TTD Chairman : భక్తుల రక్షణ ఎలా..!! టీటీడీ!!

తిరుమలలో గత కొంతకాలంగా చిన్నారులపై చిరుత దాడుల నేపథ్యంలో టీటీడీ పాలక మండలి భేటీ అయ్యింది.

by sai krishna

తిరుమలలో గత కొంతకాలంగా చిన్నారులపై చిరుత దాడుల నేపథ్యంలో టీటీడీ పాలక మండలి భేటీ అయ్యింది. టీటీడీ చైర్మన్(TTD Chairman)గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకరరెడ్డి(Bhumana Karunakara Reddy) తొలిసారిగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలు చర్చించారు.


దీంట్లో చిన్నారి భక్తులపై చిరుత దాడి నిమిత్తం భూమన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులకు, దుకాణాల యజమానులకు,వన్యప్రాణుల(Wildlife)కు ఆహారం ఇచ్చేవారికి తగు హెచ్చరికలు జారీ చేశారు.

అలిపిరి కాలినడక మార్గంలో..కనుమ రహదారుల్లో జంతువులకు ఆహారం పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు మెట్ల మార్గంలో చెత్త వేసే దుకాణాల యాజమానులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.

అంతేకాకుండా, ప్రతి 30 మీటర్లు దూరానికి వెలుతురు కనపడేలా మెట్ల మార్గంలో ఫోకస్‌ లైట్ల(Focus lights)తో పాటు 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని..ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు.భూమన మాట్లాడుతూ ”మెట్ల మార్గంలో కంచె (ఫెన్సింగ్‌) ఏర్పాటుకు టీటీడీ సిద్ధంగా ఉంది.


దీనికి సంబంధించి ఇప్పటికే అటవీశాఖకు ప్రతిపాదనలు పెట్టాము. అయితే, ఏం చేయాలన్నా అటవీశాఖ ఆంక్షలు కఠినంగా ఉన్నాయి. అలాగే మెట్ల మార్గంలో వచ్చే భక్తులను అప్రమత్తం చేయనున్నాం.

దారిపొడవునా సూచిక బోర్డులు(Indicator boards), లఘుచిత్రాలు(Short films) ప్రదర్శించనున్నాం. ఇకపై 12 ఏళ్లలోపు పిల్లలను కాలినడక మార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తాం.

పెద్దలకయితే రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉంటుంది.కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తాం. అటవీశాఖలో సిబ్బంది నియామకానికి అవసరమైన నిధులను తితిదే సమకూరుస్తుంది.

దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులను కాలినడక మార్గంతో పాటు ఏ దారిలో వచ్చినా అనుమతిస్తాం.” అని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. చిరుత దాడిపై వస్తున్న ఆరోపణల దృష్ట్యా అటవీ శాఖ అదనపు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శాంతిప్రియ పాండే మీడియాతో మాట్లాడారు.

తిరుమల నడకదారిలో వైల్డ్ లైఫ్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇవాళ(ఆగస్ట్ 14) పట్టుబడిన చిరుత డీఎన్‌ఏ, రక్తం, వెంట్రుకలు నమూనా సేకరించినట్లు ఆమె వెల్లడించారు.

చిరుతపులి నమూనా ద్వారా అది మనిషిని తిన్నదా..? లేదా..? అని త్వరలోనే నిర్ధారించి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ మేరకు చిరుత నమూనాలను ఐసర్‌కు పంపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తిరుమలలో నడకదారిలో కంచె ఏర్పాటు చేయటం కుదరదని స్పష్టం చేశారు. దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. ఎందుకంటే చిరుత చెట్లను, కంచెను సులువుగా దాటగలదని శాంతిప్రియ అన్నారు.

ఈరోజు ఎస్వీ జంతు ప్రదర్శనశాలలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కూడా ఆమె తెలిపారు.

 

You may also like

Leave a Comment