జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean)కు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే భూకుంభ కోణం(Land Scam) కేసులో ఆయన రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ఈడీ(ED) అధికారులు సోరెన్ ధ్వంసం చేసిన వాట్సాప్ చాట్ రికవర్ చేశారు. అయితే, 539 పేజీలతో ఉన్న ఈ చాట్‌లో మరికొన్ని అక్రమాలు బయటపడ్డాయి.
ఈ వాట్సాప్ చాట్‌ను ఈడీ అధికారులు కోర్టులో సమర్పించారు. ఈ కీలక చాట్‌లో అధికారుల పేర్లు, వారికి ఎక్కడ పోస్టింగ్ కోరుకుంటున్నారో తెలుసుకుని.. అందుకు తగినట్లు లంచం డిమాండ్ చేసినట్లు తేలింది. నకిలీ పత్రాలు సృష్టించి, ప్రభుత్వ ధ్రువపత్రాలను తారుమారు చేసి సోరెన్ ప్రభుత్వం… భూముల్ని అక్రమంగా సంపాదించిందని ఈడీ నిర్దారించింది.
అదేవిధంగా సోరెన్ తన సన్నిహితులతో కలిసి ప్రభుత్వ భూములను లాక్కోవడమే కాకుండా లంచాలు తీసుకుంటూ అధికారులను వారు కోరిన చోటకి బదిలీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. సోరెన ఆయన మిత్రుడు బినోద్ సింగ్ మధ్య జరిగిన వాట్సాప్ మెసేజ్‌లో రూ.కోట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు చెప్పారు.
మరోవైపు రాంచీ పీఎంఎల్ఏ కోర్టు సోరెన్‌కు ఈడీ రిమాండ్‌ను మరో 5 రోజులు పొడిగించింది. జార్ఖండ్‌లో భూకుంభకోణం విచారణలో భాగంగా సోరెన్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. దర్యాప్తు చేస్తున్న కొద్దీ అక్రమాలు బయటపడుతుండటంతో సోరెన్‌కు ఉచ్చు బిగుస్తున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.