కార్టీలియా క్రూయిజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) జోనల్ మాజీ డైరెక్టర్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ని నిందితునిగా పేర్కొంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. కార్టీలియా క్రూయిజ్ కేసులో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పేరును చేర్చకుండా ఉండేందుకు సమీర్ వాంఖడే (Sameer Wankhede) లంచం అడిగారని ఆరోపణలు వచ్చాయి.
ఆర్యన్ ఖాన్ నుంచి సమీర్ వాంఖడే రూ. 25 కోట్లు లంచం డిమాండ్ చేసినట్టు అభియోగాలు రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. వెంటనే సమీర్ వాంఖడేపై కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. మరోవైపు రూ. 25 కోట్ల లంచం అభియోగాల నేపథ్యంలో సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా అటు ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.
ఇది ఇలా వుంటే తనపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేయడంపై వాంఖడే స్పందించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ తన పై కేసు నమోదు చేసిందని వివరించారు. ఇది తనను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని వెల్లడిచారు. ఈ కేసు విచారణలో ఉన్నందున తాను ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనన్నారు.
రెండేండ్ల క్రితం కార్టీలియా క్రూయిజ్‌లో మాదక ద్రవ్యాఖల కేసులో ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణ అనంతరం ఆర్యన్ ఖాన్ కు ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో వాంఖడే మీద తీవ్ర ఆరోపణలు రావడంతో ఆయన్ని జోనల్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించి ఆయనపై విచారణ మొదలు పెట్టారు. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ నుంచి వాంఖడేతో పాటు మరో నలుగురు రూ. 25 కోట్లు లంచం డిమాండ్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది.