పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ (ED) అధికారులపై దాడి జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో ఈడీ, అధికార టీఎంసీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అదిర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈడీ స్వయంగా ఒక ఇడియట్ అని ఆయన అన్నారు. అలాంటిది ఈడీ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు.
ఈ కేసులో నిందితున్ని అధికార టీఎంసీ పార్టీ జాగ్రత్తగా చూసుకుంటుందని ఆరోపించారు. పార్టీలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులను కాపాడేందుకు అధికార టీఎంసీ పని చేస్తుందని విమర్శలు గుప్పించారు. ఇది నిందితులను జాగ్రత్తగా చూసుకునే ప్రభుత్వం అన్నారు. అలాంటప్పుడు లుకౌట్ నోటీసులతో ఏం ప్రయోజనమని మండిపడ్డారు.
రోహింగ్యాల గురించి బీజేపీ గగ్గోలు పెడుతోందన్నారు. అయితే ఇంతకాలం వాళ్లంతా ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. హోం మంత్రిత్వ శాఖ ఎక్కడ? అని నిలదీశారు. ఈ విషయం వార్తల్లోకి రావడంతో ఇప్పుడు బీజేపీ రాజకీయాలు ప్రారంభించిందని విమర్శలు గుప్పించారు. అంతకు ముందు ఆయన బెంగాల్ లో రాష్ట్ర పతి పాలనకు డిమాండ్ చేశారు.
ఈడీ అధికారులపై జరిగిన దాడి ఘటనపై ఇప్పటి వరకు మమతా బెనర్జీ ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు. సందేశ్ ఖలీ ఘటన వెనుక ఎవరు ఉన్నారనే విషయాన్ని సీఎం మమత బెనర్జీ మౌనమే చెప్తోందన్నారు. మమత మద్దతు లేకుండా దాడి జరిగేదే కాదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సర్కార్‌కి మధ్య సంబంధం ఉందని విమర్శలు చేశారు.
బెంగాల్ లోని సందేశ్ ఖాలీలో టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు మార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో సెంట్రల్ ఆర్మీ జవాన్లు టీఎంసీ నేత ఇంటి తాళం పగులగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వందలాది మంది దుండగులు వచ్చి కేంద్ర బలగాలు, ఈడీ అధికారులపై దాడులు చేశారు.