ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో నిన్నటి వరకు ఎన్నికల హడావుడి ఉండగా.. నేటితో సార్వత్రిక ఎన్నికల (General Election) నామినేషన్ల గడువు ముగిసింది. ఇందులో భాగంగా 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.. కాగా ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయి.. అందుకే పొలిటికల్ హీట్ రికార్డ్ స్థాయిలోకి వెళ్ళింది.
మరోవైపు 175 అసెంబ్లీ స్థానాలకు 4, 210 నామినేషన్లు దాఖలు కాగా 25 పార్లమెంట్ స్థానాలకు 731 మంది నామినేషన్లు వేశారని తెలుస్తోంది. కాగా రేపటి నుంచి మూడురోజుల పాటు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరుగుతుండగా.. మే 13 న ఎలక్షన్స్ ఉన్నాయి.. ఇక నిన్న ఒక్కరోజే పార్లమెంట్ స్థానాలకు 203 మంది అభ్యర్థులు 236 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి..
అదేవిధంగా నేడు అసెంబ్లీ స్థానాలకు సైతం భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయని సమాచారం. ఇదిలా ఉండగా.. అధికార వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందుల (Pulivendula) లో నామినేషన్ వేయగా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) కుప్పంలో, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురంలో నామినేషన్లు వేశారు. మరోవైపు తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది.
ఈరోజు ఉదయం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు 547 మంది అభ్యర్థులు 856 సెట్ల నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా నామినేషన్ సమయం ముగిసింది. ఇక్కడ 13కి పైగా నామినేషన్ల దాఖలు అయినట్లు సమాచారం. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుండగా, ఈనెల 29వ తేదీన ఉపసంహరణకు గడువు ఉంది.