Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారాను మోగించేందుకు ఎన్నికల కమిషన్ (EC) సిద్దపడుతోంది. . అక్టోబరు రెండో వారం లోగా షెడ్యూల్ ని ప్రకటించాలని యోచిస్తోంది. దీనిపై అధ్యయనం చేసేందుకుచీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajeev Kumar ) నేతృత్వాన ముగ్గురు సభ్యుల బృందం తెలంగాణకు రానుంది. అక్టోబరు మొదటి వారంలో ఈ బృందం రాష్ట్రాన్నిసందర్శించవచ్చు. రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత గడువు వచ్చే ఏడాది జనవరి వరకు ఉంది. ఇంతకుముందు గడువుకు ముందుగానే సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు చేయడంతో 2018 అక్టోబరు 6 న షెడ్యూల్ వచ్చింది.
డిసెంబరు 7 న పోలింగ్ జరిగింది. తెలంగాణతో బాటు మిగిలిన నాలుగు రాష్ట్రాలకు కూడా ఒకే సారి ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితిని కూడా ఈసీ పరిగణనలోకి తీసుకుంది. ఒక్క మిజోరం శాసన సభ గడువు మాత్రం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుంది. ఇక అక్టోబరు, నవంబరు నెలల్లో ప్రభుత్వ సెలవులతో బాటు స్థానిక లేదా పండుగల సెలవులు ఏమైనా ఉన్నాయా.. అని ఈసీ ఆరా తీయడం విశేషం. సాధారణంగా ఈ నెలల్లో దసరా, బతుకమ్మ, దీపావళి పండుగలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర పెద్ద సెల్లవులు లేవని అధికారులు గుర్తించారు.
ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఈసీ పూర్తి స్థాయి బృందం రెండు దఫాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఎలెక్షన్ కమిషన్ స్థాయి అధికారులు ఇదివరకే తెలంగాణాలో పర్యటించి ఆయా జిల్లాల కలెక్టర్లతోను, ఇతర అధికారులతోను చర్చించారు. షెడ్యూల్ ప్రకటించడానికి ముందు సన్నధ్దతను సమీక్షించేందుకు మరో దఫా నామినేషన్ల గడువు ముగిసిన తరువాత మరికొన్ని పర్యటనలు ఉంటాయి. ఇక తెలంగాణాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇటీవల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. అయితే నవంబరు 4 న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
డిసెంబరు లోనే పోలింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నది ఈసీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక లోగడ హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ప్రధాన పార్టీలు వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు ప్రచారం ఉన్న నేపథ్యంలో.. ఈసారి ఆయా పార్టీల అభ్యర్థులు పెట్టే వ్యయం పై కూడా ఈసీ ఫోకస్ పెట్టనుంది.