కుత్బుల్లాపూర్ (Kutbullapur) అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి కూనా శ్రీశైలం గౌడ్ (Kuna Srisailam Goud) ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీజేపీ (BJP) రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలిసి గాజులరామారం డివిజన్ చంద్రగిరినగర్ లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్, బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
బస్తీ ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇచ్చే దమ్ము కేసీఆర్ (KCR)కి లేదు కానీ గుడిసెలు వేసుకున్న వారి దగ్గర భూములు లాక్కొని పెద్దవాళ్ళకు కట్టబెడుతున్నారని ఈటల మండిపడ్డారు.. ఆనాటి ప్రభుత్వాలు ఎల్లమ్మబండలో ఉన్న 250 ఎకరాలలో 160 ఎకరాలు పేదలకు పంచాయి. మిగిలిన 92 ఎకరాలలో దేశ్ పాండే అనేవాడు రేకులు పాతే ప్రయత్నం చేసిండు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న నేను రేకులు పీకేసి ఇది ప్రభుత్వ భూమి నువ్వు ఎవడ్రా అంటూ అతన్ని అడ్డుకున్నానని ఈటల తెలిపారు.
కానీ కేసీఆర్ ఆ భూమిని 4500 కోట్లకు బ్రోకర్లకు కట్టబెట్టిండని ఈటల ఆరోపించారు. బంజారాహిల్స్ లో నేను రాములు నాయక్ కలిసి ప్రభుత్వం భూములను కబ్జా కాకుండా కాపాడుకున్నాం. ఆ నాటి ముఖ్యమంత్రి రోశయ్య గారికి చెప్తే ఇళ్లను కూలగొట్టకుండా ఆపారు. కానీ ఈ ముఖ్యమంత్రి అన్నింటినీ కబ్జాలు పెడుతున్నాడని ఈటల మండిపడ్డారు. అలాంటి దలారికి ఓటు వేసి గెలుపిద్దామా? అని ప్రశ్నించారు ఈటల..
కేసీఆర్ ప్రజలను నమ్ముకొలేదు. డబ్బులు నమ్ముకున్నారు.. డబుల్ బెడ్ రూం ఇవ్వలేదని మీరు కోపంగా ఉంటే..100 కోట్లు ఖర్చుపెడతాడు. ఓటుకు 10 వేలు ఇస్తాడు.. ప్రజలారా అవి మీ నుంచి దోచుకున్న డబ్బులు ఇస్తే తీసుకోండి. కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయండని ఈటల రాజేందర్ కోరారు. మరోవైపు మొన్న ప్రధాని నన్ను పక్కకు పిలుచుకొని మాట్లాడాడు. నాలుగు హామీలు ఇవ్వమన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పమన్నారు. పుస్తెలు కాళ్ళమీద పెట్టీ ఏడ్చే రోజులు పోవాలని ప్రధాని కోరుకుంటున్నారని ఈటల తెలిపారు.
బీజేపీ అధికారంలోకి వస్తే.. కుటుంబ పెద్దను కోల్పోయిన పేదవారికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అందిస్తాం. పేదవారికి 60 గజాల స్థలం ఇస్తాం లేదంటే డబుల్ బెడ్ రూం అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు ఈటల.. కేసీఆర్ ప్రజలకు కల్యాణలక్ష్మి కింద 13500 కోట్లు ఇచ్చి, మద్యాన్ని అలవాటు చేసి ప్రజల నుంచి 45 వేల కోట్లు లాక్కుంటున్నాడని ఆరోపించారు ఈటల..
మరోవైపు అవినీతి ప్రభుత్వాన్ని ఓడించాలని ఈటల పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రంలో బ్రతుకులు బాగుపడతాయని ఆశపెట్టిన కేసీఆర్.. బంగారు తెలంగాణ కాదు బాధల, కన్నీళ్ళ తెలంగాణ మనకు ఇచ్చాడని ఈటల ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తె తెల్లరేషన్ కార్డులు అందిస్తాం. నిజమైన బంగారు తెలంగాణ తీసుకువస్తామని ఈటల రాజేందర్ (Etela Rajender) వెల్లడించారు.