తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి బీఆర్ఎస్(BRS) ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి(Telangana Ex CM), బీఆర్ఎస్(BRS) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గురువారం రాత్రి బాత్రూమ్‌లో కాలు జారిపడడంతో ఆయనను హుటాహుటిన సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. దీంతో డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పలు పరీక్షలు నిర్వహించింది.
అయితే, కేసీఆర్‌కు తుంటి ఎముక విరిగినట్లుగా గుర్తించి శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. అనంతరం విజయవంతంగా తుంటి కీలు ఆపరేషన్ (Hip Replacement surgery) పూర్తి చేశారు. కేసీఆర్‌కు గాయం కావడంతో అసలు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స అంటే ఏమిటి..? అనేది చాలా మందికి తెలియదు. తుంటి మార్పిడి సర్జరీ ఎలా చేస్తారు..? కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది..? సర్జరీ అయ్యాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? తదితర వివరాలను తెలుసుకుందాం..
మానవ శరీరంలో తుంటి కీలు అనేది కీలకమైన ఎముక. శరీర బరువునంతా మోసేది ఈ తుంటి కీళ్లే. శరీరం పైభాగం కాళ్లకు అనుసంధానం చేయడంతో పాటు కాళ్లను కదపడానికి తోడ్పడుతుంది. అందుకే ఈ తుంటికీలుకు ఏ చిన్న సమస్య వచ్చినా కొన్ని సందర్భాల్లో జీవితం మంచానికే అంకితమయ్యే ప్రమాదం ఉంటుంది. తుంటి కీలుకు రక్త ప్రసరణ ఆగిపోతే కీలు అరిగిపోతుంది.
తుంటి ఎముక విరిగితే మంచానికే అతుక్కొని పోవాల్సి వచ్చేది. చివరికి కాలకృత్యాలు కూడా తీర్చుకోవడమూ కష్టతరమవుతుంది. ఇప్పుడు వైద్య శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందడంతో పలు రకాల సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. తుంటి కీలు విరిగిన వృద్ధులు శస్త్రచికిత్స తర్వాత కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు.. తర్వాత ఎవరిపై ఆధారపడకుండా సాధారణ జీవితం గడపొచ్చు. ఆర్థపెడిక్ సర్జన్లు మాత్రమే తుంటి కీలు సర్జరీ చేయగలరు. ఈ సర్జరీకి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
వైద్యుడి సలహా మేరకు నాలుగు నుంచి ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాలి. పదేళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణ జీవితం గడపొచ్చు. 20 ఏళ్ల తర్వాత అవసరం అనుకుంటే మరోసారి ఆపరేషన్ చేయాల్సిరావొచ్చు. ఆర్ధోపెడిక్స్‌లోనూ ప్రస్తుతం అరుదైన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మోకాలు, తుంటి కీళ్ల మార్పిడి ఇతర శస్త్రచికిత్సలకు క్యువిస్ జాయింట్ రోబోటిక్ సిస్టమ్ రోబో అందుబాటులోకి వచ్చింది. తుంటి కీలు సర్జరీకి ఖర్చు కూడా అధికంగానే వుంటుంది.
భారత్‌లో ప్రస్తుతం హిప్ రీప్లేస్‌మెంటర్ సర్జరీకి సర్జన్ ఫీజులు, అనుబంధ చికిత్సలు ఇతరత్రా కలిపి రూ.3.5లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నూటికి 95శాతం విజయవంతం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే దీని వల్ల కొన్ని నష్టాలూ ఉన్నాయంటున్నారు. కొందరిలో ఇన్ఫెక్షన్, రక్తం గడ్డకట్టడం, హిప్ డిస్‌లోకేషన్, నరాల సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు.