కనీస మద్దతు ధర (MSP)కు చట్ట బద్దతతో పాటు ఇతర డిమాండ్లతో ఇటీవల రైతులు ‘ఛలో ఢిల్లీ’ (Chalo Delhi)కార్యక్రమాన్ని చేపట్టారు. నేటితో ఈ యాత్ర ఐదవ రోజుకు చేరుకుంది. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతులను ఎక్కడిక్కడే పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్రయోగించారు. తమ ప్రాణాలు పోయినా సరే తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు.
ఇది ఇలా వుంటే రైతుల నిరసన ప్రదర్శన వేదికల వద్ద ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఫోటోలు దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది. వేదిక వద్ద పలు ట్రాక్టర్లు, సైన్ బోర్డుల వద్ద ఖలిస్తాన్ ఉగ్రవాదుల అమృత్ పాల్ సింగ్, బింద్రేయిన్ వాలా పోస్టర్లను కనిపించడం కలవర పెడుతోంది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
2020లోనూ రైతుల ఆందోళన సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్బంగా పలువురు ఆందోళనకారులు ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. పోలీసుల భద్రతా వలయాన్ని దాటుకుని చారిత్రాత్మక ఎర్రకోట వద్దకు చేరుకున్నారు.
ఎర్రకోటపై ఉన్న భారత జాతీయ పతాకాన్ని తొలగించడం అప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆందోళనకారుల ట్రాక్టర్లకు, వాహనాలకు ఖలీస్తాన్ ఉగ్రవాదుల ఫోటోలు కనిపించడం మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టినట్టు సమాచారం.