ఈ రోజు కోసం భారత్ (India) మొత్తం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తోందని యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ (CM Yogi Adityanath) అన్నారు. 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మనందరి కల నెరవేరిందని చెప్పారు. ఈ ఆనందకరమైన క్షణాలను వర్ణించేందుకు తనకు మాటలు రావడం లేదని వెల్లడించారు. ఈ పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజున, భారతదేశంలోని ప్రతి గ్రామం రామనామంతో మార్మోగిపోతోందని చెప్పారు.
ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ మాట్లాడుతూ…. ‘రామ్ లల్లా’ భగవాన్ కి జై అంటూ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ఆనందాన్ని వివరించేందుకు మాటలు రావడం లేదన్నారు. తన మనస్సు భావోద్వేగానికి గురవుతోందని వెల్లడించారు. ప్రాణ ప్రతిష్ట సందర్బంగా దేశ ప్రజలందరికీ యోగీ ఆదిత్య నాథ్ శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలో ప్రతి మార్గం రామ జన్మభూమి వైపే వస్తోందన్నారు. ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించిన చోటే నిర్మించామని అన్నారు. దేశమంతా ఇప్పుడు రామ మయంగా మారిపోయిందన్నారు. ప్రతి మనసులో రామ నామం ప్రతిధ్వనిస్తోందన్నారు. ప్రతి ఒక్కరి కండ్లు ఆనంద భాష్పాలతో నిండి పోయిందన్నారు. ప్రతి ఒక్కరు రామ నామాన్ని జపిస్తున్నారని చెప్పారు.
అయోధ్య అనేది సంస్కృతికి రాజధానిగా నిలుస్తోందన్నారు. కొత్త అయోధ్య పాత అయోధ్యను సంరక్షిస్తోందన్నారు. నగరానికి విమానాశ్రయాన్ని తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని అన్నారు. ఈ క్షణం భారత్ గర్వాన్ని పునరుద్ధిస్తోందన్నారు. ఇది జాతికి ఒక దేవాలయమని పేర్కొన్నారు.. ఇది ఒక గొప్ప చారిత్రాత్మక క్షణమని తెలిపారు.
ఇప్పుడు అయోధ్య వీధులు తుపాకీ కాల్పులతో ప్రతిధ్వనించవన్నారు. ఇక్కడ కర్ఫ్యూ ఉండబోదన్నారు. ఇప్పుడు ఇక్కడ దీపోత్సవం, రామోత్సవాలు జరగనున్నాయని వివరించారు. శ్రీరాముడి పేరు ‘సంకీర్తన’ వీధుల్లో ప్రతిధ్వనిస్తుందన్నారు. ఎందుకంటే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టతతో రామ రాజ్యం స్థాపించబడుతుందని పేర్కొన్నారు.