రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీ పేలుడు సంభవించింది. అలీపూర్ ఏరియా(Alipore Area)లోని ఓ పేయింట్ ఫ్యాక్టరీ(Paint factory)లో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత అగ్నిప్రమాదం జరగగా మంటలంటుకుని కెమికల్ డబ్బాలు పేలాయి. దీంతో 11మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం 5.25గంటలకు మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి 22 ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది సజీవ దహనం కాగా వారిని గుర్తించడం కష్టతరంగా మారింది. మృతుల్లో ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మంటలంటుకుని ఫ్యాక్టరీలో ఉంచిన కెమికల్ డ్రమ్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఢిల్లీలోని రద్దీగా ఉండే నివాస ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.
జనవరి 26న కూడా ఢిల్లీలోని షహదారా ప్రాంతంలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. అదేవిధంగా షహదారా ప్రాంతంలోని బహుళ అంతస్థుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరగడంతో పసిపాపతో సహా నలుగురు వ్యక్తులు ఊపిరాడక మృతిచెందారు.