హైదరాబాద్ నాంపల్లి(Nampally)లోని బజార్ ఘాట్లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. రసాయన గిడ్డంగిలో ఉదయం 10గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకొని ఎనిమిది మంది కార్మికులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.
నాలుగు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. లోపల ఇంకా 10 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గిడ్డంగి వద్ద ఉన్న కారు, ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నాలుగు అగ్నిమాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నారు.
అపార్ట్మెంట్లో పెద్దఎత్తున పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. దీంతో అధికారులు అప్రమత్తమై పక్క బిల్డింగ్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. ఒక్కసారిగా మంటలు చూసి భయాందోళన గురయ్యామని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. డీజిల్ డ్రమ్ములు పేలడం వల్లే ప్రమాదం భారీ స్థాయిలో ఉందని పోలీసులు వెల్లడించారు.
డీసీపీ వెంకటేశ్వర్లు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో గ్యారేజ్ ఉంది. అక్కడ కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో డీజిల్, కెమికల్ డ్రమ్ములున్నాయి. దీంతో మంటలు వాటికి అంటుకుని అపార్ట్మెంట్లోని పైఅంతస్తులకు వ్యాపించాయి. పొగ వల్ల ఊపిరాడక మృతిచెందినట్లు తెలుస్తోంది. ముగ్గురికి గాయాలయ్యాయి’ అని చెప్పారు.