మల్లంపేట(Mallampeta)లోని నారాయణ మహిళా జూనియర్ కళాశాల(Narayana Women’s Junior college)లో కలుషిత ఆహారం(food poison) తిని 200మంది విద్యార్థులు అస్వస్థత(students sick)కు గురయ్యారు. దీంతో విద్యార్థులను హుటాహుటిన స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
కలుషిత ఆహారం, తాగునీరు కలుషితం కావడమే విద్యార్థులు అస్వస్థత గురికావడానికి కారణంగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థులను సంక్రాంతి సెలవుల పేరుతో 10రోజులు ముందుగానే ఇళ్లకు పంపిస్తున్నారు.
ఈ కళాశాలలో మొత్తం 1500మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. వారిలో కలుషిత ఆహారం, తాగునీటి సమస్య వల్ల 200 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఓ వైపు సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నా సంక్రాంతి సెలవుల పేరుతో విద్యార్థులను ఇళ్లకు పంపించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కళాశాల ఏజీఎం ప్రసాద్‌ను వివరణ కోరగా వాతావరణ సమస్య వల్ల కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురైంది వాస్తవమేనని తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా సంక్రాంతి సెలవులకు ఇళ్లకు పంపిస్తున్నామన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు సంక్రాంతి సెలవుల అనంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కళాశాల తరచూ వివాదాస్పదమవుతోంది. గతంలో ఈ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను మరో చోటుకు పంపించడంతో తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.