బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ (EX MLA Shakeel) కుమారుడు రహేల్ (Rahel)ను పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు(Arrest) చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.అనంతరం అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సమాచారం.
దీంతో పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలిస్తున్నారు. ఈనెల 22 వరకు రహేల్ జైలులోనే ఉండనున్నారు. అయితే, గతంలో షకీల్ కుమారుడి మీద పలు కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి హిట్ అండ్ రన్ కేసు కాగా, మరొకటి ప్రజాభవన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీకొట్టాడు.
హిట్ అండ్ రన్ కేసులో ఓ చిన్నారి మృతి చెందగా మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ప్రజాభవన్ వద్ద జరిగిన యాక్సిడెంట్ ఘటనలోనూ పలువురికి గాయాలైనట్లు సమాచారం. అయితే, మాజీ ఎమ్మెల్యే షకీల్ తన పలుకుబడిని వాడి కొడుకు స్థానంలో వేరే వ్యక్తిని ఆ కేసులో ఇరికించి రహేల్ ను దుబాయ్ పంపించాడు.
అప్పటినుంచి అతని మీద లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయి. ఈ క్రమంలోనే విదేశాల నుంచి రహేల్ తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు ఉదయం అతన్ని అదుపులోకి తీసుకుని నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది.