కాంగ్రెస్ (Congress) మాజీ ఎంపీ హర్షకుమార్ (Harsha Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీసీసీ చీఫ్ పదవిని వైఎస్ షర్మిలకు అప్పగిస్తే ఇబ్బందికర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. వైఎస్ షర్మిల తెలంగాణకు చెందిన వ్యక్తి అని, ఆమెకు ఏపీతో సంబంధం లేదని తెలిపారు. ఆమెకు ఇక్కడ పార్టీ పగ్గాలను అప్పగించడం సరికాదని చెప్పారు. తెలంగాణ కోడలు అయినందున ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఆమెకు ఇవ్వవద్దని కోరారు.
కాంగ్రెస్‌లో షర్మిల చేరిక అనేది కుట్రతో కూడినదని వెల్లడించారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం మరో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న వైఎస్ షర్మిలకు ఏపీలో నాయకత్వం బాధ్యతలు ఇస్తే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందన్నారు. తెలంగాణలో లీడర్ షిప్ కావాలనుకున్న షర్మిలను తీసుకువచ్చి పెడితే ఆంధ్ర వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతింటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బతికించే నాయకులే లేరా అని ప్రశ్నించారు. పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు అన్నాచెల్లెళ్ల మధ్య పోటీ కనపడలేదని వెల్లడించారు. కొన్ని సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సామరస్య ధోరణి లేకపోతే వివాహ ఆహ్వానం ఇవ్వడానికి అరగంట సమయం ఎందుకు పడుతుందని నిలదీశారు. ఢిల్లీలో ఏం మాట్లాడాలి, ఢిల్లీలో ఎలా ప్రవర్తించాలి, కాంగ్రెస్ పెద్దలతో ఎలాగా ఉండాలి, వారి నుంచి ఎలాంటి హామీలు తీసుకోవాలనే విషయాలపై ఆమెకు జగన్ ట్రైనింగ్ ఇచ్చి పంపారన్నారు.
తాను మోడీని చూసుకుంటానని, నువ్వు సోనియాను చూసుకో అని షర్మిలకు జగన్ చెప్పారని ఆరోపించారు. అలా చేస్తే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా మనం సేఫ్ గా ఉంటామని షర్మిలతో జగన్ అన్నారని తెలిపారు. ఏపీలో జగన్‌ను గద్దె దించేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఫిబ్రవరి 8న రాజమండ్రిలో ‘దళిత సింహగర్జన’ నిర్వహిస్తున్నామని వివరించారు.