పంజాబ్-హర్యానా సరిహద్దులో రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ పోరాటాలు చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం(Central Government) రైతులకు(Formers) శుభవార్త చెప్పింది. వానాకాలం సాగుకు సంబంధించి రైతులకు ఎరువుల(Fertilizers)పై భారీ రాయితీని ప్రకటించింది.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో వానాకాలం పంటకు ఫాస్ఫేటిక్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులపై మొత్తం రూ.24,420 కోట్ల సబ్సిడీకి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. దీనికి గురువారం మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. అదే సమయంలో రైతులు ఉపయోగించే ప్రధాన ఎరువులైన డీఏపీ క్వింటాలు రూ.1,350 ధరకే అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
డీఏపీ (డి-అమోనియం ఫాస్ఫేట్), పీ అండ్ కే ఎరువుల రిటైల్ ధరలు స్థిరంగా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పీ అండ్ కే ఎరువులపై సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ‘న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ’ (ఎన్ఐబీఎస్) రేట్లను నిర్ణయించాలన్న ఎరువుల శాఖ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎరువుల కంపెనీలకు నిర్ణీత ధరల ప్రకారం సబ్సిడీ ఇవ్వడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తామన్నారు. అదేవిధంగా డీఏపీపై దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఎన్బీఎస్ పథకం కింద మూడు కొత్త ఎరువుల గ్రేడ్లను చేర్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
రానున్న వానాకాలం పంటకు నత్రజని (ఎన్) కిలోకు రూ.47.02, ఫాస్ఫేట్ (పి) కిలో రూ.28.72, పొటాష్ (కె) కిలో రూ.2.38, సల్ఫర్ (ఎస్)పై సబ్సిడీ కిలో రూ.1.89గా నిర్ణయించారు. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంఓపీ) కూడా ఒక్కో బ్యాగ్‌కు రూ.1,670, ఎన్పీకే రూ.1,470 చొప్పున అందుబాటులో ఉంటాయి.