– నగరంలో న్యూ ఇయర్ జోష్
– అలర్ట్ అయిన మత్తు ముఠాలు
– జోరుగా మాదక ద్రవ్యాల సరఫరా
– జూబ్లీహిల్స్ లో ఇద్దరి అరెస్ట్
– హబ్సిగూడలో మరో ఇద్దరు
న్యూ ఇయర్ (New Year 2023) వచ్చిందంటే చాలు మత్తు ముఠాలు అలర్ట్ అయిపోతాయి. యువతను టార్గెట్ గా చేసుకుని మాదకద్రవ్యాలు, గంజాయిని విచ్చలవిడిగా అమ్మేస్తుంటాయి. ఈసారి కూడా ఆయా ముఠాలు సైలెంట్ గా పావులు కదుపుతున్నాయి. అయితే.. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి వీరి ఆట కట్టిస్తున్నారు. తాజాగా నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.
న్యూ ఇయర్ నేపథ్యంలో వారం ముందుగానే పోలీసుల తనిఖీలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పలు చోట్ల భారీగా మత్తు పదార్థాలు దొరికాయి. పబ్ లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, బార్లు, ఇలా అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలో సోదాలు జరుపుతున్నారు పోలీసులు. ఇదే క్రమంలో జూబ్లీహిల్స్ లో తనిఖీలు జరపగా.. 100 గ్రాముల కొకైన్ తో పాటు 29 ప్యాకెట్ల బ్రౌన్ షుగర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
ఇటు, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో అమ్మడానికి తీసుకొచ్చిన 2.6 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. హబ్సిగూడ ప్రాంతంలో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పక్కా సమాచారంతో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు, ఉస్మానియా వర్సిటీ పోలీసులు కలిసి ఇద్దర్ని అరెస్ట్ చేశారు.
సూర్యాపేట బొడ్రాయి బజార్ కు చెందిన సాయి నవీన్, వంశీ స్నేహితులు. తేలికగా డబ్బు సంపాదించేందుకు వీరిద్దరు కలిసి కొంతకాలంగా అదే ఏరియాకు చెందిన వంశీ అనే వ్యక్తి నుంచి 3 వేల రూపాయలకు కిలో చొప్పున గంజాయి కొని వెయ్యి రూపాయలకు వంద గ్రాముల చొప్పున హైదరాబాద్ లో అమ్ముతున్నారు. సాయి నవీన్ గతంలో గంజాయి అమ్ముతూ సూర్యాపేట టౌన్, మోతె పోలీసులతోపాటు ఖమ్మం ఎక్స్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. వంశీ కూడా గంజాయి అమ్ముతూ మోతె పోలీసులకు దొరికాడు.