భారత 75వ గణతంత్ర (Republic Day) వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీలతో కలిసి ఆయన వీక్షించారు.
గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఫ్రాన్స్‌కు లభించిన విశిష్టమైన గుర్తింపునకు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు. ఈ ఈవెంట్‌ను ఫ్రాన్స్, భారత్ మధ్య లోతైన స్నేహానికి చిహ్నంగా అభివర్ణించారు.
అంతకు ముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి సాంప్రదాయ గుర్రపు బండిలో మాక్రాన్ కర్తవ్యపథ్ చేరుకున్నారు. ఇది ఇలా వుంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటన సందర్బంగా భారత్-ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వత్రా వెల్లడించారు.
వైమానిక రంగంలో ఇరు దేశాల మద్య ఒప్పందాలు కుదిరాయని.. ఇవి రక్షణ రంగంలో ఇరు దేశాలు ఉమ్మడి కార్యచరణతో ముందుకు వెళ్లేందుకు సహాయపడుతుందని వివరించారు. ఒప్పందాల్లో భాగంగా రక్షణ ఉత్పత్తులు, తయారీతో పాటు సైనిక, సాంకేతిక సహకారం, అంతరిక్ష, ఇతర రంగాల్లో ఇరు దేశాలు సహకరించుకోనున్నట్టు తెలిపారు.