హైదరాబాద్‌లో వరుస ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి (Gaddam Vivek Venkata swami) ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు (IT Raids) నిర్వహించారు. హైదరాబాద్ సోమాజిగూడతోపాటు మంచిర్యాలలోని నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దమొత్తంలో డబ్బు పంచుతున్నారని వివేక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వివేక్ బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇక, వివేక్ కంపెనీ నుంచి నుంచి మ్యాన్‌పవర్ కంపెనీకి బదిలీ అయిన రూ.8 కోట్ల నగదును అధికారులు ఫ్రీజ్ చేశారు.
ఈనెల 13న బేగంపేటలోని హెచ్డీఎఫ్సీ బ్రాంచ్‌లోని విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఓ ఖాతా నుంచి బషీర్‌బాగ్‌లోని ఐడీబీఐ బ్యాంకుశాఖలోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాలోకి రూ.8కోట్ల నగదు బదిలీ అయినట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందించింది.
ఈ నేపథ్యంలో అనుమానాస్పద రూ.8 కోట్ల నగదును బ్యాంకు అధికారులు ఫ్రీజ్ చేశారు. అదేవిధంగా ఈనెల 15న మాజీ ఎంపీ వివేక్‌కు చెందిన కంపెనీ ఉద్యోగులు చెన్నూరుకు రూ.50లక్షలు తరలిస్తుండగా హైదరాబాద్ రామంతాపూర్‌లో పట్టుబడిన సంగతి తెలిసిందే.