ప్రపంచ దేశాలు కొత్త సంవత్సరానికి(New Year-2024) స్వాగతం పలుకుతుంటే గాజాలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సెంట్రల్ గాజా(Gaza)లో ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం(Israel Army) జరిపిన భారీ వైమానిక దాడుల్లో 35 మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. చాలా భవనాలు భారీగా కుప్పకూలాయి.
గాజాలో హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం కొన్ని నెలల పాటు కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శనివారం అర్ధరాత్రి తెలిపారు. కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయ డిమాండ్లను అంగీకరించబోమని ఆయన అన్నారు. నెతన్యాహు చేసిన ఈ ప్రకటనతో యుద్ధం కారణంగా పెరుగుతున్న పౌరుల మరణాలు, ఆహార పదార్థాల తీవ్రమైన కొరత, పెద్ద ఎత్తున ప్రజలు వలసలు వెళ్తున్నా కాల్పుల విరమణ ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ హమాస్ స్థానాల కోసం ఇజ్రాయెల్ దళాలు వెతుకుతున్నాయని మిలటరీ తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి జరిపిన దాడుల్లో సెంట్రల్ డీర్ అల్-బలాహ్ లోని అల్-అక్సా ఆసుపత్రి అధికారులు ఆదివారం 35 మృతదేహాలను కనుగొన్నట్లు ధృవీకరించారు.
మరోవైపు, ఆదివారం ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి చేసింది. హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన నాలుగు చిన్న పడవలను లక్ష్యంగా చేసుకున్నారు. యుఎస్ ఆర్మీ రెండు నౌకా వ్యతిరేక క్షిపణులను ధ్వంసం చేసింది. మూడు రోజుల వ్యవధిలో అమెరికా విఫలయత్నం చేయడం ఇది రెండోసారి.