ఈటల రాజేందర్ (Eatala Rajender).. రాష్ట్ర రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. రెండేండ్ల క్రితం అధికార బీఆర్ఎస్ (BRS)లో మంత్రిగా పని చేసిన ఆయన.. భూకబ్జాల ఆరోపణలతో పార్టీకి రాజీనామా చేసి బీజేపీ (BJP)లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈటల ప్రస్తుతం ఎనిమిదోసారి అసెంబ్లీ బరిలో నిలిచారు.
కాగా నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈటల రాజేందర్ హుజురాబాద్ (Huzurabad) గజ్వేల్ (Ghazwel)నుంచి బరిలో నిలుస్తున్నారు.. ఈ క్రమంలో గజ్వేల్ నియోజకవర్గాన్ని పలకరించారు ఈటల.. తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ఉన్న శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ అభ్యర్థిగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. అవినీతికి.. న్యాయానికి మధ్య పోటీ నెలకొందని అన్నారు. తాను తప్పు చేయకున్న బయటికి గెంటేశారని అప్పటి రోజులను గుర్తు చేశారు. రాజకీయం అంటే వ్యాపారం కాదన్న ఈటల.. దమ్ముంటే రాజీనామా చేసి గెలిచి చూపించాలని కేసీఆర్ సవాల్ చేస్తే.. రాజీనామా చేసి గెలిచి చూపించానని వెల్లడించారు.
హుజురాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెన్నుపోటు రాజకీయాలకు పాల్పడితే.. ధర్మం గెలిచి, తనని కూడా గెలిపించిందని అన్నారు. అదే రోజు గజ్వేల్‌లో కేసీఆర్ మీద పోటీ చేస్తానని సవాల్ చేశాను.. అన్నట్టుగానే ఈ రోజు పోటీకి దిగానని ఈటల తెలిపారు.