ఢిల్లీ విశ్వవిద్యాలయ(Delhi University) ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా(Professor GN Saibaba) మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో అరెస్టయి జీవితఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆ తీర్పును బాంబే కోర్టు(నాగ్‌పుర్ బెంచ్) పక్కనపెట్టింది.
ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అని ప్రకటించింది. ఈ కేసులో సాయిబాబాతో పాటు మరో ఐదుగురికి జీవిత ఖైదు శిక్ష పడగా వారికీ ఊరట లభించింది. నిందితులపై ఉన్న ఆరోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్(Prosecution) విఫలమైనట్లు ధర్మాసనం తెలిపింది. అందువల్ల అభియోగాలను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ కేసులో సాయిబాబాతో అరెస్టయిన మరో ఐదుగురిని కూడా నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. దేశంపై యుద్ధం చేస్తున్నారని, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో 90శాతం వైకల్యంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన సాయిబాబా, మరో ఐదుగురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసు విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేపట్టింది.
2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు నిందితులందరికీ జీవితఖైదు విధించింది. అప్పటి నుంచి సాయిబాబా నాగ్‌పుర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా అరెస్టైన నేపథ్యంలో 2014లో సాయిబాబాను ఢిల్లీ యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది.