ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో తుపాకులు గర్జించాయి.. ఈ దండకారణ్యంలో నెత్తురోడుతున్న దృశ్యాలు తరచుగా చోటు చేసుకొంటున్న విషయం తెలిసిందే.. తాజాగా మరోసారి బుల్లెట్స్ వర్షం కురిసింది. రాష్ట్రంలోని కాంకేర్ (Kanker) జిల్లాలో ఛోటేబెతియా (Chhotebethiya) పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, నక్సల్స్ మధ్య వార్ నడిచింది. ఇక్కడ స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది.
నేడు పోలీసులు, నక్సల్స్ మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం.. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించినట్లు తెలిపారు.. ఈ నేపథ్యంలో నక్సల్స్ ని మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కాంకేర్ ఎస్పీ ఐకె ఎలెసెలా తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది.
అందుకే ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతోందని ఎస్పీ వెల్లడించారు.. సరిహద్దు భద్రతా దళం (BSF), జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) సంయుక్త బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొందని తెలిపారు.. మరోవైపు కాంకేర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో నక్సల్స్ కదలికలు ఆందోళనకు గురిచేస్తున్నాయని అంటున్నారు..
ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలున్న బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు భద్రతా బలగాలు, పోలీసుల..చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 34 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. దీంతో ఈ ప్రాంతాన్ని భద్రతా బలగాలు మరింత జల్లెడ పడుతున్నాయి..