అమర్ హది రాణి (Hadi Rani)… హదా చౌహన్ రాజ్ పుత్ కూతురు. ఔరంగజేబు (Aurangzeb)తో సంబంధాలు పెట్టుకోవాలన్న తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకించిన గొప్ప వీర నారి. వివాహం జరిగిన మరుసటి రోజే భర్తకు వీర తిలకం దిద్ది కదన రంగానికి పంపిన వీర పత్ని. యుద్దంలో పాల్గొనే భర్తకు తన ఆలోచనలు అడ్డుగా ఉండకూడదని తన తల నరికి పంపిన గొప్ప వీరనారి.
రాజస్థాన్ రూప్ నగర్లో రాజపుత్ వంశానికి చెందిన యువరాణి ప్రభావతి. కళ్లు తిప్పుకోనివ్వని అందం ఆమె సొంతం. ఆమె అందం గురించి తెలుసుకున్న ఔరంగజేబు ప్రభావతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ మేరకు రూప్ నగర్‌కు ఔరంగజేబు వర్తమానాన్ని పంపాడు. ఔరంగజేబుతో వివాహం ఇష్టం లేని ప్రభావతి ఆ ప్రతిపాదనను తిరస్కరించింది.
ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఔరంగజేబు తన సేనలను రూప్ నగర్ వైపు పంపించాడు. విషయం తెలుసుకున్న ప్రభావతి… మేవర్ రాజు మహారాణా రాజ్ సింగ్ సహాయాన్ని కోరింది. ఆమె విన్నపాన్ని అంగీకరించిన రాణాసింగ్ ఆమెకు రక్షణ కల్పిస్తానని మాట ఇచ్చాడు. అదే సమయంలో రాణా రాజ్ సింగ్ కుమారుడు రాణా రతన్ సింగ్ వివాహం హదీ రాణితో జరిగింది.
అప్పటికే ఔరంగజేబు సేనలు రూప్ నగర్ వైపు అడుగులు వేస్తున్నాయి. దీంతో ఔరంగజేబు సేనలను అడ్డుకునేందుకు యుద్దభూమికి రావాలని కుమారుడ రతన్ సింగ్ కు తండ్రి రాణా రాజ్ సింగ్ వర్తమానం పంపాడు. వివాహం మరుసటి రోజు యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేకున్నా అయిష్టంగానే రాణా రతన్ సింగ్ బయలు దేరాడు. కానీ ఆయన ఆలోచన అంతా భార్య హదీ దేవీ చుట్టే తిరుగుతున్నాయి.
తన భార్య ఆలోచనలతో తాను పరితపిస్తున్నానని, అందువల్ల ఆమె గుర్తుగా హది రాణి నుంచి ఏదైనా వస్తువు తీసుకు రావాలని భటులను ఆదేశించాడు. దీంతో ఈ విషయాన్ని భటులు హది రాణికి చెప్పారు. దీంతో యుద్దంలో పాల్గొనే విషయంలో భర్తకు తన ఆలోచనలు అడ్డుగా ఉన్నాయని భావించింది. వెంటనే తల నరికి తన భర్తకు పంపింది. ఆమె మరణంతో కలత చెందిన రాజు ఆ దు:ఖంతోనే ఔరంగజేబు సేనల్ని ఓడించాడు.