ఇటీవల చాలా మంది విద్యార్థులు చిన్న విషయానికే డిప్రేషన్ కి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.. చదువులో ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, వేధింపులు, ఆర్థిక భారం తట్టుకోలేక కఠిన నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఇలా కారణాలు ఏమైతేనేం ఆత్మహత్య మాత్రమే పరిష్కారంగా భావిస్తున్నారు.. ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై క్షణికావేశంలో తీసుకొనే నిర్ణయాలు వారి కుటుంబాలను తీవ్ర మనో వేదనకు గురిచేస్తున్నాయి..
తాజాగా ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతుంది. బీటెక్ విద్యార్థిని రేణుశ్రీ ఆత్మహత్య ఘటన మరువక ముందే హన్మకొండ (Hanmakonda) జిల్లా, హసన్ పర్తి (Hasan Parthi) మండలం, అన్నసాగర్ (Annasagar) ఎస్ఆర్ యూనివర్సిటీ (SR University)లో విషాద ఘటన చోటు చేసుకొంది. బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థిని రాథోడ్ దీప్తి, క్యాంపస్ హాస్టల్ లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పపడింది. కాగా మృతురాలు మంచిర్యాల జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది..
సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.. ఈ క్రమంలో దీప్తి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. ఆమె ఎవరితో చాటింగ్ చేసింది.. ప్రేమ వ్యవహారం ఉందా?.. ఎవరైనా బెదిరంచారా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంతో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు సంక్రాంతి పండగ సమయంలో ఇలాంటి ఘటన జరగడం.. దీప్తి స్నేహితులతో పాటు.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పండుగ పూట ఇలాంటి ఘోరం జరుగుతుందని ఊహించలేకపోయామని కన్నీటిపర్యంతం అవుతున్నారు.