బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఉద్యోగ భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తే, తమ ప్రభుత్వ ఘనతగా కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం హడావుడి చేస్తుండటం దౌర్భాగ్యమని హరీష్ రావు (Harish Rao) విమర్శించారు.. నియామక పత్రాల జారీ పేరిట నేతలు చూపిస్తున్న యాక్షన్ ఓవర్ అయ్యిందని ఎద్దేవా చేశారు.. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం వంట అయినంక గరిటె తిప్పినట్లుందని సెటైర్ వేశారు..
చేయని పనులకు డబ్బా కొట్టుకోవడం బదులు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై శ్రద్ధ చూపాలని హితవు పలికిన హరీష్ రావు.. 2024, ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటనలు చేసిన కాంగ్రెస్, దాని నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకే ముందు రోజున స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ కార్యక్రమాన్ని హంగు ఆర్బాటంతో నిర్వహిస్తున్నదని ఆరోపించారు.
2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించి, తుది ఫలితాలు విడుదల చేసే సమయానికి ఎన్నికల కోడ్ మొదలైందని, దీంతో ఫలితాల విడుదలకు ఆటంకం కలిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ (Telangana) వైద్యారోగ్య రంగాన్ని దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేర్చే లక్ష్యంతో పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల నిర్మాణంతో పాటు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
ఇందులో భాగంగా 5,204 స్టాఫ్ నర్స్ పోస్టులకు 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా, 2023 జూన్ 22న 1,890 పోస్టులను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కు పెరిగిందని వివరించారు.. మరోవైపు ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్, ఏప్రిల్ 1న గ్రూప్ 2, జూన్ 1న గ్రూప్ 3,4 నియామకాలకు నోటిఫికేషన్, మార్చి1న పోలీసు తరహా యూనిఫాం పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.