రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.. డిసెంబర్ 9న రైతు బంధు ఇస్తామని మాట తప్పారు.. ఎప్పుడు వేస్తారు అని అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని తెలిపారు.
ఎన్నికల సమయంలో రైతులకు బోనస్ ఇస్తాం అని చెప్పిన కాంగ్రెస్.. వడ్లకు 5వందల బోనస్ ఎప్పుడు ఇస్తారు? వడ్లు కొనుగోలు ఎప్పుడు చేస్తారు చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తే రైతులకు మేలు జరుగుతుందని హరీశ్ రావు పేర్కొన్నారు. తుపాను కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిసాయని, వాళ్ళను ఆదుకోవాలని హరీష్ రావు కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు (Rythu Bandhu) కింద ఎకరాకి రూ.15000 డిసెంబర్ 9వ ఇస్తామని చెప్పినట్టు గుర్తు చేశారు. మరోవైపు కొత్త ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకు హరీశ్ రావు శుభాకాంక్షలు చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశాల (Assembly Meetings) ముగింపు అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీష్ రావు.. అధికార పక్షం అయినా ప్రతిపక్షం అయినా ఎప్పుటికీ తాము ప్రజల పక్షాన నిలబడతామని ప్రకటించారు.