మాజీమంత్రి హరీశ్‌రావు (Harish rao) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్ర పరిపాలనపై దృష్టి సారించక బీఆర్ఎస్ (BRS)పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా భవిష్యత్ తరాలకు గొడ్డలి పెట్టు అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం చేతిలో పెడితే అడుక్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా అప్పగించలేమని స్పష్టం చేసినట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు.. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా ఇవ్వాలని, ముందు ఆపరేషన్ మ్యానువల్ ఖరారు చేయాలని కోరినట్లు చెప్పారు. ఏకపక్షంగా నోటిఫై చేశారని, అపెక్స్ కమిటీకి నివేదించాలని కేసీఆర్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.
వారం రోజుల్లో ప్రాజెక్టులను అప్పగిస్తామని అంటున్నారని, జాతీయ హోదా తీసుకొస్తామని చెప్పి ఉన్న ప్రాజెక్టులను అప్పగిస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇదే జరిగితే హైదరాబాద్, ఇతర జిల్లాలకు తాగునీటి సమస్యలు వస్తాయని, పాలమూరు రంగారెడ్డి సహా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ప్రశ్నార్థకం అవుతాయని హరీశ్‌రావు తెలిపారు.
నాడు ఏడు మండలాలు, లోయర్ సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ నీరు తీసుకుపోతే సాగర్ ఆయకట్టు, ఎడమ కాల్వకు నీరు ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు కాపాడాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు..
 
			         
			         
														