కాంగ్రెస్ (Congress) పై మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో అక్రమంగా సంపాదించిన సొమ్మును తెలంగాణకు తరలిస్తోందంటూ ఆరోపణలు చేశారు. డబ్బులు పంపిణీ చేసి ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని నోట్ల కట్టలు పంచినా గెలుపు మాత్రం బీఆర్‌ఎస్‌దేనన్నారు.
మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు ఈ రోజు పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందని తేల్చి చెప్పారు. డబ్బులు ఉన్నవాళ్లకే కాంగ్రెస్ టికెట్లను కేటాయిస్తోందని ఆరోపించారు. ఆ పార్టీ నాయకులు టికెట్లు అమ్ముకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన వాటిని మంచి నీళ్లలా పంచి తెలంగాణలో గెలవాలని అనుకుంటున్నారన్నారు. హస్తం పార్టీకి తెలంగాణలో తగిన గుణపాఠం తప్పదని స్పష్టం చేశారు.
బెంగళూరులో కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు చేసిందన్నారు. ఈ దాడుల్లో కాంగ్రెస్ నేతల నివాసాల్లో రూ.42 కోట్లు దొరికాయని అన్నారు. ఆ రాష్ట్రంలో కొంత మంది వ్యాపారుల నుంచి రూ.1500 కోట్లను కాంగ్రెస్ వసూలు చేసిందన్నారు. అక్కడ అక్రమంగా సంపాదించిన ధనాన్ని ఇప్పుడు తెలంగాణకు చేరవేస్తున్నారని ఆరోపించారు.
కర్ణాటకలో ఏ భవనం, అపార్ట్‌మెంట్ నిర్మించాలన్నా దానికి అనుమతల కోసం 70 శాతం కమీషన్ ఇవ్వాలన్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. సుమారు రూ.1500 కోట్లను బెంగళూరు నుంచి చెన్నై గుండా హైదరాబాద్ కు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. అందులో కొంత మొత్తం ఇప్పటికే హైదరాబాద్ కు చేరిందని, ఇంకా కొంత డబ్బు చెన్నైకి చేరుకున్నట్టు తెలుస్తోందన్నారు.
కర్ణాటక నుంచి భారీగా డబ్బును తెలంగాణకు పంపించడంలో కొంత మంది బిల్డర్లు, వ్యాపారస్తులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. రాజకీయాలతో వారికి ఏం సంబంధం లేదని చెప్పారు. వాపారస్తులు రాజకీయాలు చేస్తే వారు తప్పకుండా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని తీవ్రంగా హెచ్చరించారు. చేతి గుర్తు పార్టీ ఎన్ని కలలు కన్నా అవి కేవలం పగటి కలలుగా మాత్రమే మిగిలి పోతాయన్నారు.