మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు కాంగ్రెస్(Congress)ను వదిలిపెట్టమని స్పష్టం చేశారు. మంగళవారం హరీష్ రావు షాద్నగర్ నియోజకవర్గ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడకు వస్తానని హరీష్ రావు భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో షాద్నగర్ ప్రజలు పోరాట స్ఫూర్తిని చూపించారని ఆయన కొనియాడారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. అయితే, గెలిచాక చేతులెత్తేసిందని విమర్శించారు. ‘‘కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ఫోన్ చేయండి. తక్షణమే మీ ముందు ఉంటా’’ అని హరీష్ రావు హామీ ఇచ్చారు.
కాగా, కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి… ఢిల్లీని కదిలించి తెలంగాణ సాధించుకొచ్చారని గుర్తుచేశారు. అదేవిధంగా స్వల్ప మెజార్టీతో షాద్నగర్లో ఓడిపోయామని హరీష్ రావు పేర్కొన్నారు.