పార్టీ మారకపోతే కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (MLA Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై హరీశ్ రావు స్పందించారు.
కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు సేవ చేయడం కంటే ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల మెడపై కత్తిపెట్టి కాంగ్రెస్‌లోకి రావాలని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వందల మంది వెళ్లి మూడు గంటలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అని ప్రశ్నించారు.
మధుసూదన్‌రెడ్డి ఏమైనా బంధిపోటా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. బెయిల్ వచ్చే సెక్షన్లతో కేసులు ఉన్నా ఏదో ఒక రకంగా జైలుకు పంపాలని చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. బెదిరించి లొంగదీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటున్నారని దుయ్యబట్టారు.
ప్రజలకి సేవ చేయడానికి అవకాశమిస్తే మాపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఆదేశాలతో దాడులు చేస్తున్నామని ఆర్డీవోనే చెబుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ క్రషర్లు ఉన్నాయని, వాటికి అనుమతి లేకున్నా లీజ్ అయిపోయినా నడుస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.