టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) ఫీజుల పెంపుపై మాజీ మంత్రి హరీశ్‌రావు(Ex Minister Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. టెట్ ఫీజులను తగ్గించకుంటే ఊరుకోబోమని, నిరుద్యోగులతో కలిసి పోరాటానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి మాజీ మంత్రి లేఖ(Letter)రాశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపరు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కార్ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనని మండిపడ్డారు. రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలు చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న సీటెట్ లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్ఈ ఫీజు రాయితీని అమలు చేస్తోందని, తెలంగాణలో ఏపీసెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ ఫీజుల రాయితీని అమలు చేస్తున్నారు.
కానీ టెట్‌లో మాత్రం తెలంగాణ ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలతో చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమనానరు. ‘ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరించారు.