నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ (BRS) అని మంత్రి హరీష్ అన్నారు. ఇటీవల నకిలీ మాటలు, వెకిలి చేష్టలు చేసే పార్టీలు ఎక్కువైయ్యాయని కాంగ్రెస్(Congress), బీజేపీ పార్టీలపై మంత్రి హరీశ్ రావు (Harishrao) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా భవన్ (Telangana Bhavan) లో జరిగిన ఒక కార్యక్రమంలో హరీష్ రావు ఈ విధంగా మాట్లాడారు.
దళితుల అభివృద్ధిపై చిత్తశుధ్ది బీఆర్ఎస్ కే ఉంది
ఇవాళ (గురువారం) ఎమ్మార్పీఎస్ నాయకుడు యాతాకుల భాస్కర్ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి) పార్టీలో చేరారు. తెలంగాణా భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో యాతాకుల భాస్కర్ కు బీఆర్ఎస్ శాలువా కప్పి హరీష్ రావు పార్టీలోకి ఆహ్వానించారు. దళిత జాతి కోసం, వారి ఉన్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి యాతాకుల భాస్కర్ అని హరీష్ రావు కొనియాడారు.
ఎన్నికలు (Elections) సమీపిస్తుండటంతో చాలా పార్టీలు వాగ్దానాలు చేయడం ప్రారంభించాయనీ, నోటికి వచ్చినట్లు అసాధ్యమైన హామీలను కూడా ఇస్తున్నాయనీ హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఒక్కటే ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ అని అన్నారు. ముఖ్యంగా దళితుల అభివృద్ధి, వారి గౌరవంమీద బీఆర్ఎష్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, అందుకే వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.
అంబేద్కర్ బాటలోనే…
దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్నితెలంగాణాలో ఏర్పాటుచేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అంతే కాకుండా తెలంగాణాలో నూతనంగా నిర్మించిన సెకట్రేరియట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టి ఆయనపై భక్తిని చాటుకున్న ప్రభుత్వం తమదేనన్నారు. కేంద్రం మాత్రం పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడమంటే ఊలుకుపలుకు లేకుండా ఉండిపోయిందన్నారు. అంబేద్కర్ బాటలోనే బాటలోనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుందని హరీష్ రావు అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే…
కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) ఒకే తానులో ముక్కలని హరీష్ రావు విమర్శించారు. అమిత్ షాకు తెలంగాణపై ఏ మాత్రం అవగాహన లేదని, ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్స్ చదివి వెళ్లిపోవడమే అమిత్ షా పనని విమర్శించారు. గుజరాత్ లో ఏం జరుగుతుందో, అక్కడ దానిని ఎలా సరిదిద్దాలో ముందుగా అమిత్ షా చూసుకుంటే మంచిందని సూచించారు. కర్నాటకలో బీజెపీపై ప్రజలకు కోపం వస్తే…కాంగ్రెస్ గెలించిందని, అంతకు మించి ఆ పార్టీ సాధించిందేమి లేదన్నారు. కాంగ్రెస్ నేత ఖర్గే సొంత రాష్ట్రం కర్నాటకలో…ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుందన్నారు.