రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ కొనసాగుతుండగా.. ఇంకోవైపు హైకోర్టులో విచారణ జరిగింది.
వరదలు, వర్షాలపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రిపోర్ట్ సమర్పించగా.. న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలన్నని ఆదేశించింది.
సమగ్ర నివేదికను సమర్పించడానికి మరో రెండు రోజుల గడువు కోరింది ప్రభుత్వం. సోమవారం రోజు పూర్తిస్థాయిలో వరదలు నష్టాలపై రిపోర్ట్ సమర్పిస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలుపగా.. నివేదిక ఇవ్వడానికి లేట్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు చీఫ్ జస్టిస్. చెప్పినట్టుగా సోమవారం నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
ఇప్పటికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వరద ప్రభావిత బాధితులకు వెంటనే పరిహారం, సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టును కోరారు. అయితే.. ప్రభుత్వ నివేదిక పరిశీలించిన తరువాత ఆదేశాలిస్తామని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది హైకోర్టు.