జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర పడింది. గత రెండు రోజులుగా కనిపించకుండా పోయిన సీఎం హేమంత్ సోరెన్ (Hemant Soren)మంగళవారం రాంచీలో ప్రత్యక్షం అయ్యారు. రాంచీలోని తన నివాసంలో జేఎంఎం (JMM) ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కూడా ఉండటం ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో సీఎం పగ్గాలను కల్పనా సోరెన్ కు అప్పగిస్తారన్న వార్తలో నేపథ్యంలో సమావేశంలో ఆమె పాల్గొనడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాంచీకి చేరుకున్న తర్వాత సీఎం హేమంత్ సోరెన్ బాపూధామ్‌లో మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. గాంధీ లాంటి అత్యంత గొప్ప వ్యక్తులు మన మధ్యే పుట్టి మనకు మార్గనిర్దేశం చేసినందుకు తాను చాలా గర్వపడుతున్నానని ఈ సందర్బంగా సోరెన్ వెల్లడించారు. అయితే సోమవారం అర్ధరాత్రి హేమంత్ సోరెన్ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
అంతకుముందు సీఎం హేమంత్ సోరెన్ మిస్సింగ్ అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మాజీ సీఎం, రాష్ట్ర బీజేపీ చీఫ్ బాబూలాల్ మరండి కీలక ట్వీట్ చేశారు. సీఎం హేమంత్ సోరెన్ గురించి ఈడీ వెతుకుతోందని, సీఎం సమాచారం అందించిన వారికి రూ. 11,000 నగదు బహుమతి అందిస్తామని ట్వీట్ చేశారు. సోరెన్ అకస్మిక అదృశ్యం కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం లాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు చేశారు.
మరోవైపు సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో ఈడీ సోదాల నేపథ్యంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్ల గురించి ఈ సందర్బంగా ఆరా తీశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మరో 7 వేల మంది పోలీసులను అదనంగా మోహరిస్తున్నామని వెల్లడించారు.