హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రభుత్వం వరుసబెట్టి విక్రయాలు సాగిస్తోంది. తాజాగా రాజేంద్రనగర్ (Rajendranagar) సమీపంలో బుద్వేల్ (Budvel) లో ఈ-వేలం షురూ చేసింది. ఈ భూములను హెచ్ఎండీఏ (HMDA) వేలం వేయడాన్ని న్యాయవాదుల సంఘం అడ్డుకునేందుకు ప్రయత్నించింది. హైకోర్టు (High Court) లో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. కానీ, వర్కవుట్ కాలేదు.
హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ ను నిరాకరించింది. బార్ అసోసియేషన్ లో విభేదాలు ఉన్నాయన్న న్యాయస్థానం.. అందరూ ఏకాభిప్రాయంతో వస్తే వాదనలు వింటామని స్పష్టం చేసింది. టైమ్ లేదని.. వేలం ప్రక్రియ మొదలవుతుందని కోర్టు కు న్యాయవాదులు తెలిపారు. పిటిషన్ పై స్టే ఇవ్వాలని కోరారు. కానీ, అందుకు అంగీకరించలేదు హైకోర్టు. స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
ఇటు వేలం పాట షురూ అయింది. 182 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బుద్వేల్ లే అవుట్ ప్లాట్ల అమ్మకంలో భాగంగా గురువారం ఈ-వేలం ప్రక్రియను ప్రారంభించింది హెచ్ఎండీఏ. ఫస్ట్ సెషన్ వేలంలో ప్లాట్ నెంబర్ 1,2,4,5,8,9,10 లకు బిడ్డర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్లను సమర్పించారు. రెండో సెషల్ లో నిర్వహించే వేలంలో మరో ఏడు ప్లాట్లకు వేలం జరగనుంది.
లే అవుట్ లో ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు, గరిష్టంగా 14.3 ఎకరాలుగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఒక్కో ఎకరానికి మినిమం రూ.20 కోట్లుగా నిర్ణయించి ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నారు.