శాసనసభ్యుల కోటా కింద ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. ఇందుకోసం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను సైతం జారీ చేసింది. అయితే ఎన్నికల కోసం తెలుపు, గులాబీ రంగుల బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC By Elections) ఒకే ఓటును ప్రాధాన్యతా క్రమంలో ధాఖలు చేయాలన్న బీఆర్ఎస్ (BRS) అభ్యర్థనను హైకోర్టు (High Court) తిరస్కరించింది.
ఈమేరకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి.. కార్తీక్‌రెడ్డి (Karthik Reddy) సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. నోటిఫికేషన్ వెలువడ్డాక కోర్టుల జోక్యానికి వీల్లేదని రాజ్యాంగంలోని 329(బి) అధికరణం స్పష్టం చేస్తున్నదని ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ అన్నారు.
ఈ వాదనను ఆమోదించిన హైకోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తీర్పు వెలువరించింది. అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఇందులో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎన్నికలు రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేసింది. పదవీ కాలం పూర్తి కాకముందు ఏర్పడే సాధారణ ఖాళీలను భర్తీ చేయడానికి అధికరణ 151 కింద నోటిపికేషన్ జారీ చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
అందువల్ల ఎన్నికల సంఘం 4వ తేదీన జారీ చేసిన ప్రెస్‌నోట్ అధికరణం 171(4)కు ఉల్లంఘన అన్న వాదన అంగీకారయోగ్యం కాదని పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినందున ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్ కొట్టివేసింది. మరోవైపు గత డిసెంబరు 3వ తేదీన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఎన్నికల షెడ్యూలును విడుదల చేస్తూ జనవరి 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.