స్కిల్ డెవలప్ మెంట్ స్కాం చుట్టూ ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. ఓవైపు టీడీపీ (TDP), వైసీపీ(YCP) నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతుండగా.. ఇంకోవైపు ఏసీబీ (ACB) కోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ స్కిల్ స్కామ్ రాజకీయ ప్రేరేపితమని చంద్రబాబు (Chandrababu) తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా అన్నారు. చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అయితే.. ముమ్మాటికీ చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ (CID) న్యాయవాది వాదించారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్ (FIR) లో చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదని కోర్టు ప్రశ్నించగా.. రిమాండ్ రిపోర్టులో అన్ని అంశాలు చేర్చామని ఏఏజీ తెలిపారు.
2021లో కేసు పెడితే ఇప్పటి వరకూ చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది. 409 సెక్షన్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా సీఐడీ పోలీసులు వ్యవహరించారని లూథ్రా వాదించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని అన్నారు.
ఇక ఏసీబీ కోర్టులో వాదనల సందర్భంగా.. చంద్రబాబు కాసేపు న్యాయవాదిగా మారారు. తన వాదనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరగా.. న్యాయమూర్తి అందుకు అనుమతినిచ్చారు. ఈ క్రమంలో స్వయంగా వాదనలు వినిపించిన చంద్రబాబు.. తన అరెస్టు అక్రమని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై అధికార జులుం ప్రదర్శిస్తున్నారని.. రాష్ట్రంలో పూర్తిగా కక్ష సాధింపు పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా చట్టబద్ధమైన పాలన జరగట్లేదన్న ఆయన.. పౌర హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని వాదించారు.
గవర్నర్ అనుమతి లేకుండానే తనను అరెస్టు చేశారని అన్నారు చంద్రబాబు. తన అరెస్టు అక్రమమన్న ఆయన.. స్కిల్ స్కామ్ తో తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు కేబినెట్ నిర్ణయమని.. ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ ను 2015-16 బడ్జెట్ లో పొందుపర్చామని.. రాష్ట్ర అసెంబ్లీ కూడా ఆమోదించిందని వివరించారు. అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని. 2021 డిసెంబర్ 9 నాటి ఎఫ్‌ఐఆర్ లో తన పేరు లేదని తెలిపారు. అప్పటి రిమాండ్ రిపోర్టులోనూ తన పాత్ర ఉందని సీఐడీ పేర్కొనలేదని వాదించారు చంద్రబాబు