హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో హోలీ పండుగ(Holi festival) వేళ విషాదం నెలకొంది. కొండచరియలు విరిగి పడటంతో జనం పరుగులు తీశారు. దీంతో జరిగిన తొక్కిసలాట(Stampede) లో ఇద్దరు మృతిచెందారు. హిమాచల్ ప్రదేశ్లోని హోలా మొహల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్లోని మేడిలో హోలీ రోజున సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో అంబ్లోని మేడి మేళా సెక్టార్ నంబర్ 5లోని చరణ్ గంగా వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ సమయంలో కొండ చరియలు విరిగిపడటంతో జనం పరుగులు తీశారు. జనం గుంపులుగా ఉండటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఉనా ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు. పర్వతం పైనుంచి రాళ్లు మీదపడటంతో చరణ్ గంగలో స్నానం చేస్తున్న మరో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.