Himachal Pradesh : తమ రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి విపత్తుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మేస్త్రీలు, కార్మికులే బాధ్యులని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు ఆరోపించారు. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదలకు సిమ్లా లోని పటిష్టమైన ఇళ్ళు, షాపులు కొట్టుకుపోయాయని, వారు చేబట్టిన నిర్మాణాల్లో శాస్త్రీయ పధ్దతులు పాటించలేదని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమకు స్థానిక మేస్త్రీలు లేరని, బీహారీ ఆర్కిటెక్ట్ గా తాను పేర్కొనే వలస మేస్త్రీలు ఇక్కడకు వచ్చి అంతస్తులపై అంతస్తులు నిర్మించారని,కానీ అవన్నీ నాసిరకంగా ఉన్నాయని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
కానీ అంతలోనే తానలా అనలేదని, బీహారీలు కూడా ఇక్కడ చిక్కుకుపోగా వారిని హెలీకాఫ్టర్ ద్వారా తరలించామని సర్ది చెప్పుకున్నారు. బీహారీలు మా సోదరుల వంటి వారు.. వారు కేవలం కూలీలు.. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో లోపాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూలిపోతున్న ఇళ్ళు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ప్రమాణాలకు అనువుగా లేవని పేర్కొన్నారు. విచక్షణా రహితంగా నిర్మాణాలు జరిగాయని, దీని ప్రభావం కొండ ప్రాంతాలపై పడిందని, సిమ్లా లోని అనేక చోట్ల కొత్తగా నిర్మించిన బిల్డింగుల్లోశాస్త్రీయ ప్రమాణాలు లోపించాయని ఆయన చెప్పారు. డ్రైనేజీ సిస్టం కూడా ఇలాగే ఉందన్నారు.
ఇక హిమాచల్,ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 80 మంది మృతి చెందారు. ఈ మూడు రాష్ట్రాల్లోదాదాపు 10 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హిమాచల్ లో కొండ చరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. ఆదివారం రాత్రి నుంచి 57 కు పైగా మృత దేహాలను కనుగొన్నామని హిమాచల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓంకార్ చంద్ శర్మ తెలిపారు.
సిమ్లా, సమ్మర్ హిల్స్, కృష్ణ నగర్ వంటి ప్రాంతాలు భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయని ఆయన చెప్పారు. ఇక పంజాబ్ లో ముఖ్యంగా గురుదాస్ పూర్ జిల్లాలో భారీవర్షాల కారణంగా ఈ నెల 17, 18 తేదీల్లో స్కూళ్ళు, అంగన్ వాడీ సెంటర్లను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భ్రాక్రా, పొంగ్ డ్యాముల్లో నీటి మట్ఠం పెరిగిందని, పరిస్థితిని జాగ్రత్తగా మదింపు చేస్తున్నామని సీఎం భగవంత్ మాన్ చెప్పారు.