ఏఐఎంఐఎం (AIMIM) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)పై పోలీసు కేసు నమోదైంది. రామ మందిరంపై వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన హిందూసేన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామ మందిరంపై విద్వేషాన్ని రెచ్చగొట్టేలా అసదుద్దీన్ వ్యాఖ్యలు చేశారంటూ హిందూసేన ఫిర్యాదులో పేర్కొంది.
ఉద్దేశపూర్వకంగా, బాధ్యతారాహిత్యంగా ఆయన దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా ఆరోపణలు చేశారు. ప్రజలకు ఓవైసీ తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఆయన లేఖ రాశారు.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలను తప్పు దారి పట్టించేందుకు అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రయత్నించారని అన్నారు. కానీ అసదుద్దీన్ ఒవైసీ దుష్ట రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని ఘనంగా ప్రారంభించే సమయంలో భారత్ లో మతపరమైన ఘర్షణలను నివారించేందుకు ఏఐఎంఐఎం నేతపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత 500 ఏండ్లుగా పవిత్ర ఖురాన్ ను పఠించిన ప్రాంతం ఇప్పుడు తమ చేతుల్లో లేదన్నారు. మరో మూడు, నాలుగు మసీదులకు సంబంధించి కుట్ర జరుగుతోందన్నారు. ఢిల్లీలోని సన్హేరీ మసీదు (గోల్డెన్ మసీదు) కూడా ఉందన్నారు. ఈ విషయం మీకు కనిపించలేదా? అని ముస్లిం యువతను ఆయన ప్రశ్నించారు. ఏళ్ల తరబడి శ్రమించి ఈరోజు మన స్థానాన్ని సాధించుకున్నామని చెప్పారు. మనం ఇప్పుడు మసీదును కోల్పోయామన్నారు. అక్కడ ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారని అన్నారు. మీ హృదయాలలో నొప్పి లేదా ? అని నిలదీశారు.